ధారగ రామ మూర్థ కలితాల్ప జటాగుహలన్ స్రవింప జూ
డారతి నీలలోహిత జటావనులందున జొచ్చుచున్న భా
గీరథినా జనెన్ గృతయుగీనము ధర్మము వాస్స్వరూపమై
ఇది కవిసమ్రాట్టులు విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధకాండము, ఉపసంహరణ ఖండము లోనిది. రావణ వధానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడౌతున్న శ్రీరామచంద్రుని గూర్చి చెప్పిన పద్యం ఇది.
భూమండలము పైనున్న అన్ని సముద్రాలు, నదుల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో వశిష్ఠులవారు శ్రీరామచంద్రుణ్ణి అభిషేకిస్తున్నారు. అవి అట్టగట్టియున్న రాముని జడలనే చిన్న గుహల నుండి ధారగా ప్రవహిస్తూ ఉంటే, చంద్రచూడుని జటావనులలో చొరబడుతున్న గంగా ప్రవాహముగా భాసిల్లి, కృతయుగమునుండి ధర్మము త్రేత లోనికి జలరూపములో జాలువారుచున్నదా యన్నట్లున్నది.
విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్షమును శివునకు అంకితమిచ్చారు. వారికి శివకేశవుల యెడల భేదభావము లేదు. చిన్ననాట వారు సేవించిన, వారి ఊరిలోనున్న వేణుగోపాలస్వామి, కాశీవిశ్వనాథుడు విశ్వనాధవారి యీ అద్వైత భావనకు ఆలంబనము. ఇది సర్వత్ర వారి కావ్యమునందు భాసిస్తుంది. అందుకనే వారు తమ వేదనను యీ విధముగా వెలిబుచ్చారు.
నీళగళా! రఘూత్తముడు నీవును నిద్దరు కానియట్లుగా
నోలి భజించితిన్ మఱల నున్న దినంబులు నట్లె చేసెదన్
వ్రాలెడు మేను దాక నభవా! బ్రదుకైన వికారభావనా
జాలము తప్పకున్న దుదిజన్మగ జేయుము దీని ధూర్జటీ!
రామాయణ కల్పవృక్ష కావ్య రసాస్వాదనము జేయగలుగు నవకాశము కలిగిన జాతిలో పుట్టుట మన పూర్వజన్మ సుకృతము గదా!
No comments:
Post a Comment