మెరుగుదీగలతోడి మేఘంబు నా జన్ని
దములతో గృష్ణాజినము ధరించి
మకరధ్వజముతోడి మరుపచ్చవిల్లు
నా గోచితో మోదుగుగోల పట్టి
చంద్రికతోడి తుషారపుంజంబు నా
దనుకాంతితో భూతిధామ మెసగ
వీణారవముతోడి వేదనాదంబు నా
రాగమ్ముతోడ శివాగమములు
చదువుచును బ్రహ్మవర్చసపదవితోడి
దివ్యతేజంబు మొగమున దేజరిల్ల
సుందరాకార మమర బాలేందుధరుడు
తాల్చి చనుదెంచె గిరిరాజతనయ కడకు.
ఈ సీసపద్యము నన్నెచోడుని కుమార సంభవము సప్తమాశ్వాసము లోనిది. కఠోరమైన తపమాచరిస్తున్న పార్వతిని పరీక్షింప దలచి, శివుడు మాయావటువు రూపముతో వచ్చాడు. ఆ వటువు ఎట్లా ఉన్నాడంటే:
మెరుపుతో కూడిన మేఘము వలె జందెము, లేడిచర్మము ధరించాడు. మొసలి గుర్తు గల టెక్కెముతో కూడిన మన్మథుని చెఱుకుగడ విల్లుని తలపించే లాగా, కౌపీనము ధరించి ఆషాఢదండము పట్టుకున్నాడు. వెన్నెలతో కూడిన మంచుసమూహమా యనునట్లు, తెల్లని శరీరముపై విభూతి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. వీణానాదముతో కూడిన వేదధ్వనియా యన్నట్లు, సంగీతముతో పాటు ఈశ్వరాగమములు పఠిస్తున్నాడు. ఈ విధముగా , బ్రహ్మవర్చస్సు, దివ్యతేజము ముఖమున ఉట్టిపడుతుండగ, పార్వతి కడకు చంద్రశేఖరుడు వచ్చాడు.
బమ్మెర పోతనగారు ఆంధ్రీకరించిన శ్రీమదాంధ్ర మహాభాగవతము లోని ఈ పద్యము చూడండి.
మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి
నువిద చెంగట నుండ నొప్పు వాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక
ముఖమున జిరునవ్వు మొలచువాడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి
బలువిల్లు మూపున బరగువాడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి
ఘనకిరీటము దల గలుగువాడు
పుండరీకయుగము బోలు కన్నులవాడు
వెడద యురమువాడు విపులభద్ర
మూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా
కన్నుగవకు నెదుర గానబడియె.
శ్రీమదాంధ్ర మహాభాగవత రచన చేయాలనే కుతూహలముతో నున్న పోతన ఎదుట రాజముఖ్యుడొకడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మూర్తిని వర్ణిస్తున్నారు పోతన్నగారు.
మేఘము ప్రక్కన మెరుపు లాగా ఆయన ప్రక్కన ఒక స్త్రీ ఉన్నది. చంద్రునిలో నుండి స్రవించే అమృతధార లాగా, ఆయన ముఖంలో చిరునవ్వు చిందులాడుతున్నది. కానుగచెట్టుకు అల్లుకున్న తీగలాగ, ఆయన భుజముపై ఒక ధనుస్సు వ్రేలాడుతూ ఉన్నది. నీలగిరిపై ప్రకాశించే సూర్యుడిలా, ఆయన తలపై కిరీటము విరాజిల్లుతున్నది. ఆ విధముగా, తెల్లతామరపూవుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలముతో, దివ్యమంగళ రూపముతో, ఒక రాజముఖ్యుడు పోతనగారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
నన్నెచోడమహాకవి పదకొండవ శతాబ్దమునకు చెందినవాడు కాగా, సహజకవి పోతనామాత్యుడు పదిహేనవ శతాబ్దమునకు చెందినవాడు. ఒక మహాకవి కావ్యము లోని పద్యము ఇంకొక మహాకవికి స్ఫూర్తిదాయకమై యుండవచ్చునని ఊహించుటకు తెలుగు సాహిత్యమున పెక్కు ఉదాహరణలు మనకు కనబడుతాయి. ఒకరు శివభక్తి పారమ్యులు కాగా, రెండవవారు శ్రీరామ పదారాధన తత్పరులు.
No comments:
Post a Comment