పొదలు నీ పొక్కిటి పువ్వు కాన్పున కదా
పెను మాయ పిల్లల బెట్టుటెల్ల
బొడము నీ మొదలి యూర్పుల నేర్పులన గదా
చదువు సంధ్యలు గల్గి జగము మనుట
కెరలు నీ యడుగుదామరల తేనియకదా
పాపంపు పెనురొంపి పలుచనగుట
పొసగు నీ తెలిచూపు పస గదా యిది రాత్రి
యిది పగలను పేర నెరుగ బడుట
భవన ఘటనకు మొదలి కంబమును బోలె
భువములకెల్ల నీ వాదిభూతుడగుట
నిట్ట నిలుచున్కిచే గాదె నెట్టుకొనియె
గెంటుగంటును లేక లక్ష్మీకళత్ర!
ఈ పద్యం చదువుతుంటే తెలుగువారిగా పుట్టి మనం ఎంత అదృష్టం చేసుకున్నామో ననిపిస్తుంది. ఎంత చక్కని పద్యం! తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, ఏరులా , సెలయేరులా........అన్న సినీగీతాన్ని గుర్తు చేస్తూ , "ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో అద్దితివేమొ గంటము మహాకవిశేఖర" అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పోతన గురించి వ్రాసిన పద్యము స్మృతిపథంలో మెదుల్తూ , తెనాలి రామకృష్ణకవి, తన పాండురంగ మాహాత్మ్యములోని యీ పద్యంలో ఎంత చక్కని తెలుగు పదాలతో అర్థగాంభీర్యాన్ని ప్రదర్శించారు. అనిపిస్తుంది. అందుకనే కాబోలు "తగ సంస్కృతము దెనుంగుగ జేయగ, దెనుగు సంస్కృతము జేయంగ చతురమతివి" అని మెప్పు పొందాడు.
ఇక యీ పద్య విశేషాలకు వస్తే, పుండరీకుని భక్తికి మెచ్చి అతని యెదుట ప్రత్యక్షమైన కృష్ణుని స్తుతిస్తూ చెప్పిన పద్యం ఇది.
పొక్కిలి అంటే బొడ్డు. ఆ పొక్కిటి పువ్వు విరిసి పురుడు పోసుకొన్నదట. దానికి పెనుమాయ పుట్టి, పిల్లలు పెట్టి వృద్ధి పొందినదట. పెనుమాయ బ్రహ్మ. బ్రహ్మ యీ జగత్తును సృష్టించడం ఆ పొక్కిటి పువ్వు కాన్పువల్ల. కావ్యరసాభిలాషులకు ఒళ్ళు పులకరించి పోదూ!
ఇక రెండవ పాదములో చూడండి. ఆ పరమపురుషుడు తీసిన నిట్టూర్పుల (ఉఛ్వాసనిశ్వాసములు) వలన, ఈ ప్రపంచానికి చదువుసంధ్యలు అబ్బినాయట. భగవంతుని ఉఛ్వాసనిశ్వాసాలే వేదాలు. అవే మనకు తొలిచదువులు, ప్రామాణికాలు, జాతి మనుగడను నిర్దేశించేవి.
స్వామి అడుగుతామరల తేనియ, అంటే, విష్ణు పాదపద్మోద్భవయైన పవిత్ర గంగా నది. ఈ గంగానది భూమిజనుల పాపాలనే బురదను కొంచెమయినా పలుచగా చేస్తున్నదట. కలియుగంలో పాపాలను పూర్తిగా కడిగివేయడం సాధ్యం గాదు.
స్వామి తెలిచూపు అంటే తేటయైన చూపు. స్వామి తేరిచూడడం వల్ల మనకు పగలు, రాత్రి అనే మార్పు తెలుస్తున్నది. సూర్యచంద్రులు భగవంతుని నేత్రాలు. ఇది చాలా వింతైన మాట. ఇది పగలు, ఇది రాత్రి అని మనం తెలుకొనగలగడం ఆయన తేరిచూడడం వల్ల. మన తెలివితేటల వల్ల కాదు. " పొసగు నీ తెలిచూపు పస గదా ఇది రాత్రి ఇది పగలని నెరుగబడుట" . రెండు భావాల మధ్య అతుకబడిన యీ పస గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? తెలుగు వారికే స్వతమయింది యీ పస. ఏమి యీ మహానుభావులు! తలచుకొంటేనే మనసు పులకరించి పోతున్నది.
ఈ బ్రహ్మాండ భాండము ఒడిదుడుకులు లేకుండా, స్తంభము వలె నిలబడడానికి కారణము ఆ ఆదిపురుషుడే. అంటే, యీ సృష్టికి మూలకారణము అతడే. ఇదీ, యీ పద్యము యొక్క భావము.
పొక్కిటి పువ్వు కాన్పు , పెనుమాయ పిల్లలు బెట్టుట, మొదలి యూర్పుల నేర్పులు, అడుగుదామర తేనియ, పాపంపు పెనురొంపి, తెలిచూపు పస ........అహో! ఏమి యీ పాండురంగవిభుని పదగుంఫన. తెలుగుజాతి ధన్యత నొందింది.
తెనాలి రామకృష్ణ కవి రచించిన పాండురంగ మాహాత్మ్యము కావ్యమునకు పామర వ్యాఖ్యానము అను పేర చక్కని టీక, తాత్పర్యము, విశేష వ్యాఖ్యను డా. డి.ఎస్.గణపతి రావు గారు అందించినారు. వారికి కృతజ్ఞతాంజలులు సమర్పించుచున్నాను.
.
No comments:
Post a Comment