ఇప్పటినుండి ఈ బ్లాగులో మీ ముందుంచే పద్యాలకు "సువర్ణ సుమన సుజ్ఞేయము" అనే పేరు పెట్టడము జరిగింది. ఈ పదబంధము తెలుగువారి పుణ్యపేటియైన పోతనగారి భాగవతము లోనిది. తెలుగువారికి, పద్యాలకు విడదీయరాని బంధము. అవి సుందరోద్యానవనంలో విరబూసిన పలు రంగుల (సువర్ణ) అందమైన పువ్వులు (పద్యములు). అందువల్ల, అవి సుజనుల మనస్సులను సుజ్ఞేయము (సువిదితము) చేస్తాయనడంలో అబ్బురమేముంది?
ఈ పని జేయడానికి భాషాభిమానమే కారణము గానీ, నాకు భాష మీద కావలసినంత అధికారము (పట్టు ) లేదని సవినయముగా విన్నవించుకుంటున్నాను. సగటు సాహిత్యాభిమానికి దగ్గరవడానికి ఇంత మాత్రపు భాష మీద మక్కువ, చొరవ చాలుననే విశ్వాసంతో ఈ పనికి పూనుకున్నాను. శరీరము, మనస్సు సహకరిస్తే, మంచి పద్యాలను మీతో పంచుకొని, కాలమయుడైన భగవంతుడు ప్రసాదించిన సమయాన్ని సద్వినియోగము చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక చదువుదాము::
కర మవిచారి, తద్దయు వికారి మనం, బది సారివోలెనే
తిరిగెడు గాని నిల్వదెట, దీని జలత్వము మాన్చి నీ పదాం
బురుహములంద సంస్మరణము బొంద దయన్ సురబృందవంద్య
సుస్థిరముగ నిల్పు తత్వవిధి దెల్పు సమస్థితి సల్పు! శంకరా!
ఈ పద్యము నన్నెచోడకృత కుమారసంభవ కావ్యము లోనిది. పర్వతరాజ పుత్రి పార్వతి, శివుని పతిగా పొందగోరి కఠోరమైన తపమాచరించింది. ఆ సమయంలో శివుని గూర్చి ఈ విధంగా తలపోసింది:
"పరమేశ్వరా! మనస్సనేది సరియైన ఆలోచనలు చేయలేనిది; పలు వికారములకు లోనయ్యేది. అది కుమ్మరివాని చక్రం లాగా నిలకడ లేక తిరుగుతూనే ఉంటుంది. నీవు దయతో దీని నిలకడలేనితనాన్ని మాన్పి, నీ పదపద్మాల యందు దృష్టి నిలిచేటట్లుగా, నీ తత్వము తెలిసేటట్లుగా, సమత్వము కలిగేటట్లుగా అనుగ్రహించు."
ఇటువంటి భావాన్నే, ధూర్జటి మహాకవి తన కాళహస్తీశ్వర శతకములో వెలువరించాడు.
" శ్రీ విద్యుత్కలితాజవంజవ మహా జీమూతపాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్,
దేవా! మీ కరుణా శరత్సమయ మింతే జాలు చి
ద్భావనాసేవం తామరతంపరై నిలచెదన్ శ్రీకాళహస్తీశ్వరా!"
సంసారనేది ఉరుములు, మెరుపులు, దట్టమైన మేఘాలు, ఎడతెరిపి లేని వర్షధారలతో కూడుకున్న వర్షాకాలము వంటిది. అంటే, బంధనాలతో కూడుకున్నది సంసారము. వర్షకాలములో సరోవరములోని పద్మాలు తమ నిగారింపు కోల్పొయినట్లే, నా మనస్సనే పద్మము కూడా సం యమనము కొల్పోయింది. అందువల్ల, పరమేశ్వరా! వర్ష ఋతువు దాటిన తరువాత, శరదృతువు ఏ విధంగా సూర్యకిరణాలను ప్రసరింప జేసి, మరల పద్మాలను వికసింప చేస్తుందో, నీ దయ అనే చల్లని వెన్నెలను నాపై కురిపించి, నన్ను చిద్భావనలో ( జ్ఞాన మార్గములో) నడిపించు. అప్పుడు, నా మనుగడ తామరతంపరగా (పరంపరాభివృద్ధిగా) విలసిల్లుతుంది.
ఇటువంటి పద్యాలను మననం చేస్తూ , దైనందిన జీవితములో ఆచరించి సంయమనాన్ని సమత్వాన్ని పాటిస్తే, జీవితము ఆనందమయమవుతుంది.
No comments:
Post a Comment