మనకు భారత, భాగవత, రామాయణాలలో చక్కని ప్రార్థనా పద్యాలు కనబడతాయి. అవి మననం చేసుకుంటూ, దైనందిన కార్యక్రమాలు చేసుకొనే వారెందరో ఉన్నారు.
ఆ కోవకు చెందినదే ఈ పద్యము. చదవండి.
జగదుద్భవస్థితి క్షయ హేతువెవ్వడా
దేవాదిదేవుండు దిక్కు నాకు
గ్రాహనిగ్రహమీగి కరిగాచె నెవ్వడా
త్రిభువనాధీశుండు దిక్కు నాకు
దుదిపదంబు నొసంగి ధ్రువుగాచె నెవ్వడా
ధృఢ దయామయమూర్తి దిక్కు నాకు
ద్రోవది బన్నంబు దొలగించె నెవ్వడా
దీనమందారుండు దిక్కు నాకు
నెవ్వని పదాబ్జమున జనియించు జలము
మజ్జనకుడైన శివుడాత్మమౌళి నిలిపె
నమ్మహా విష్ణు డా కృష్ణు డా గుణాభ్థి
దేవకీనందనుడె యెందు దిక్కు నాకు
ఇది తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యము అనే కావ్యము లోనిది.
త్రిపురాసుర సంహార సమయములో, శివుని మేని నుండి కారిన ఘర్మజలము (చెమట నీరు) భూమి మీద పడి భైమీనదిగా ప్రవహించింది. మాహావేగంతో ప్రవహిస్తూ వస్తున్న ఆ నదిని పాండురంగ క్షేత్రపాలకుడైన కాలభైరవుడు నిరోధిస్తాడు. అప్పుడు భైమీనది చేసిన ప్రార్థనయే యీ పద్యము. అర్థము సువిదితమే. శ్రీమహావిష్ణువును సృష్టి స్థితి లయ కారకునిగ, (త్రిమూర్త్యాత్మకునిగా ) వర్ణించిన తెనాలి కవి, తక్కిన మూడు పాదములలో, విడిగా విష్ణువును స్థితి కారకునిగా చూపి, అతని శిష్ట రక్షణను గజేంద్ర మోక్షణ కథ, ధృవోపాఖ్యానము, ద్రౌపదీ మానసంరక్షణ కథలను ధ్వనింపజేసాడు.
అయితే మహాకవియైన రామకృష్ణుని గడుసుదనమంతా గీతపద్యంలో ఉంది. భైమీనది తన జన్మకారకుడైన శివుడు, విష్ణు పాదోద్భవయైన గంగానదిని తన శిరస్సున ధరించాడని, అందువల్ల శివుని మేని నుండి ఉద్భవించిన తనకు, కృష్ణుని(విష్ణువు) పాదముల చెంత ఇంత చోటివ్వమని ప్రార్థిస్తుంది. ఇంకొక విశేషం కూడా ఉంది యీ గీతపద్యములో. కృష్ణుణ్ణి గుణాబ్ధి అని సంబోధించడము. నది సముద్రాన్ని చేరడం లోకసహజమే కదా!
No comments:
Post a Comment