జ్ఞానస్వరూపమై సర్వాత్ము డున్న దా
జ్ఞేయస్వరూపమై నెఱసియుండు
బురుషస్వరూపమై పరమేశుడున్న దా
బ్రకృతిస్వరూపమై పరగుచుండు
సూక్ష్మస్వరూపమై శుద్ధాత్ముడున్న దా
స్థూలస్వరూపమై తోచియుండు
నర్థస్వరూపమై యమలాత్ముడున్న దా
శబ్దస్వరూపమై జరుగుచుండు
హరుడు రుద్ర రూపమై యున్న దా నుమా
మూర్తి దాల్చి లోకములకు హితము
సేయుచుండు గాన శివశక్తి భేదంబు
తెఱగు నీకు జడున కెఱుగ లావె?
ఈ పద్యము నన్నెచోడ మహాకవి రచించిన కుమారసంభవము కావ్యము సప్తమాశ్వాసము లోనిది. కపట వటువు రూపములోవచ్చిన శివుడు , "శ్మశానవాసియైన శివుని వరించి, తపస్సు చేయడము తగదని " నిందావాక్యములుపలుకగా, ఆ మాయావటువు నుద్దేశించి, పార్వతి చెలికత్తెలు, శివశక్తుల తత్వాన్ని తెలియజేయడము యీ పద్యం యొక్క విశేషము.
సర్వాత్ముడైన శివుడు జ్ఞానస్వరూపుడై యుండగ, పార్వతి జ్ఞేయస్వరూపమై ఉంటుంది. జ్ఞేయమనగా తెలియదగినది. పురుషస్వరూపమై శివు డుండగా, ప్రకృతి స్వరూపమై పార్వతి వెలుగొందుతుంది. శుద్ధాత్ముడైన శివుడు సూక్ష్మస్వరూపుడై యుండగా, పార్వతి స్థూలస్వరూపమై తోచియుంటుంది. శివుడు అర్థస్వరూపమై యుండగా, పార్వతి శబ్దస్వరూపమై యుంటుంది. శివుడు రుద్ర రూపమై యుండగా, పార్వతి ఉమాదేవి రూపాన్ని దాల్చి లోకానికి హితాన్ని చేకూరుస్తుంది. మందబుద్ధులకు శివశక్తుల అవినాభావ స్థితి అర్థం కాదు.
దక్షయజ్ఞ విధ్వంసము కథ యీ విషయాన్నే మనకు తెలియజేస్తుంది. తెలిసి తెలిసీ సతీదేవి దక్షుని యాగశాలకు వెళ్ళడం, దక్షునికి శివశక్తుల అభేదాన్ని తెలియజేయడము కోసమే. శివుని తూలనాడిన తన తండ్రి దక్షుని కూతురు, దాక్షాయణిగా జీవించడానికి మనస్కరించక, తనువు చాలించింది. తద్వారా, శివుని యందలి రుద్రాంశను మేల్కొల్పి, దక్షుని అహంకారాన్ని రూపుమాపి, ఉమాదేవిగా లోక హితాన్ని చేకూర్చింది.
సీసపద్యం లో శివునికి, పార్వతికి వాడిన విశేషణాలన్నీ శివశక్తుల అభేదాన్ని సూచిస్తాయి. సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో ( " శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్త: ప్రభవితుం " ) - శంకరులు యీ విషయాన్నే ప్రస్తావించారు. కాళిదాసు "వాగర్థా వివ సంపృక్తౌ" అనే శ్లోకము ఇక్కడ గుర్తుచేసుకోదగింది.
విశ్వనాథవారు తమ రామాయణ కల్పవృక్షములో పలుతావుల, మహేశ్వరియైన సీతకు, పరమేశ్వరుడైన రామునికి గల అవినాభావస్థితిని, సీతామహాదేవి మాటల ద్వారా తెలియజేస్తారు.
పతియు జలంబు నేనును బ్రవాహము, రాఘవు డాకసంబు నే
నత మృదుగీతి, నింద్రుడగు నాయన నేను హవిస్సు, నాతడున్
శృతియు స్వరంబు నేను, రఘుశూరుడు రసమూర్తి స్థాయి నే
నతనికి నాకునైన అవినాస్థితి దుస్థితి పొంద దెప్పుడున్.
పైన వివరించిన అంశాలన్నీ శివునితో శివానికి గల అవినాస్థితిని తెలియజేయడమే గాక, పరమేశ్వరి యొక్క ప్రేరణా శక్తిని కూడా విదితము చేస్తున్నాయి.
No comments:
Post a Comment