సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద ప్రబంధము వర్ణనలకు పెట్టింది పేరు. కృష్ణదేవరాయలవారి ప్రకృతి పరిశీలన చాలా నిశితమైనది. ఆధునిక సమాజములో, పల్లెటూళ్ళలో వ్యవసాయము చేసుకుంటున్న రైతులకు కూడా తెలియని పలు విషయాలు రాయలవారి వర్ణనలలో మనకు కనుపించి, ఆనాటి సాంఘిక వ్యవస్థను, రైతు జీవనాన్ని మనోగోచరం చేస్తాయి. ఉదాహరణకు, వివిధ రకములైన వరిధాన్య విశేషాలు ఒక పద్యంలో కనిపిస్తాయి. ఒక్క రాజనాలు తప్ప, తీగమల్లెలు, ఖర్జూరాలు, పుష్పమంజరులు, మామిడి గుత్తులు, కుసుమాలు, సంపెంగలు, పచ్చలు , గన్నేరులు, పాళలు, మొదలగునవి పుష్పజాతులని మనకు తెలుసు. ఇవి ఆనాడు రైతులు పండించిన వరిధాన్య రకాలని మనకు తెలియదు. ఇక, చాలామందికి తెలియని ఇంకొక విశేషం కూడా రాయలువారు ఈ పద్యంలో యెంతో రమణీయంగా చెప్పారు చూడండి.
అడుగున బండి వ్రీలి అసలై మధువుట్టగ ద్రాగుదేంట్లు మ
ల్లడి గొని చుట్టురా బనసల్చొలుచుంగలు గుండ్లతోడ నీ
డ్వడు పెనుబండ్లు, భిన్న కట పాంసుల భూరిమదాంబు సేచనా
జడ దృఢ శృంఖలాయుత వసంత నృప ద్విరదాధిపా కృతిన్.
శ్రీవిల్లిపుత్తూరులోని తోటలలో పనస. చెట్లున్నాయి . . అవి వేరు పనస చెట్లు. మనమందరం కొమ్మలకు కాసే పనస కాయలను చూశాము. ఇవి చెట్టు వేరుకు కాసే పనసపండ్లు. పనస , పండుగా అయిన తరువాత, భూమి పగిలి, పండు రసం కారితే, దానికి, చీమలు, తుమ్మెదలు మూగుతాయి. ఇక ఆ పనసపండ్లు యెంత పెద్దగా ఉన్నాయంటే, అవి పెద్ద బండరాళ్ళ లాగా ఉన్నాయి. ఈ మొత్తం చూడడానికి ఎట్లాఉన్నదంటే, వసంతుడనే చక్రవర్తి యొక్క పట్టపుటేనుగు దవడలనుండి మదజలం స్రవిస్తూ ఉంటే, ఆ ఏనుగును కట్టివేసే గొలుసులాగా ఉంది తుమ్మెదల బారు. ఎంత చక్కని పోలిక. ఎంత నిశితమైన దృష్టి. పెద్ద పెద్ద బండరాళ్ళలాగా ఉన్న పనసపండ్లు మదగజాల్లాగా ఉన్నాయట. పండిన పెద్ద పనసపండు బూడిద రంగులో ఏనుగు లాగానే ఉంటుంది. పండు రసం దాని చెక్కిళ్ళనుండి స్రవించే మదజలం లాగా ఉన్నదట.. పండ్లరసం చుట్టూ మూగిన తుమ్మెదలబారు, ఆ ఏనుగును కట్టివేసిన గొలుసు లాగా ఉన్నదట. ఏనుగు దవడల నుండి కారే మదజలం చుట్టూ తుమ్మెదలు మూగడం మనకు తెలిసిన విషయమే. ఎంత సహజమైన వర్ణన.
శ్రీకృష్ణదేవరాయలవారి చలువ వల్ల, పనసపండు పండినట్లే తెలుగువారి పంట పండింది. మనం వారి కావ్యరసాన్ని జుఱ్ఱుకోగలుగుతున్నాము.