Tuesday, 21 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 658 (మా స్వామి: 73)










ఆకర్ణించెద నేమియో ప్రమథ శంఖారావమో ! జాట వీ
థీకల్లోల తరంగ దేవతటినీ దీప్తారవంబో? కుభృ
చ్ఛ్రీకన్యామణి పాదనూపురమణిక్రేంకారమో ! నన్ని దే
కైకో నీ వరుదెంతు వీ ధ్వని యదే కాబోలు ! విశ్వేశ్వరా !

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై మూడో పద్యం.

" విశ్వేశ్వరాఅదేదో ధ్వని వస్తున్నది వింటాను స్వామీఅది ప్రమథగణాల శంఖారావమా? నీ జటావనుల్లో సుడులు తిరుగుతున్న దేవనది అయిన మందాకిని యొక్క తరంగాల దివ్యనాదమా? పర్వతరాజపుత్రి పాదమంజీరమణుల చప్పుడా? ధ్వని అదే కాబోలు ! నీవు వస్తున్నట్లున్నావు. నన్ను స్వీకరించు ప్రభూ ! "

పార్వతీపరమేశ్వరులది అర్థనారీశ్వరతత్త్వం. అందుచేత, అవి అయ్యగారికి సంబంధించిన విశేషణాలైనా, అమ్మవారికి సంబంధించినవైనా, అవన్నీ కలిపి ఒకే ఒక చైతన్యస్వరూపం



Monday, 20 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 657 (మా స్వామి: 72)











నీ వేమో యరుదెంతువంచు మఱి నన్నే వచ్చి నా తండ్రి ' యీ 
నీవా నన్నెద నమ్మి కష్టముల నెన్నేఁ బొందె ' దం చోర్పుగా
నేవో చెప్పెద వంచు నా మనసులో నేమేమొ యూహించి నీ
పై విశ్వాసము నుంచితిన్ వదల కప్పా ! నన్ను విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై రెండో పద్యం.

" విశ్వేశ్వరా ! తండ్రీనువ్వొస్తావని, వచ్చి, "  ఓహో ! నువ్వా ? నన్ను హృదయంలో నమ్ముకొని, ఎన్నెన్నో కష్టాలనుభవిస్తున్నావు కదా ! " అంటూ ఓర్పుగా యేవేవో ఓదార్పు మాటలు మాట్లాడతావని, నా మనసులో యేవేవో ఊహించుకొని, నీ పైన అంతులేని విశ్వాసముంచానయ్యానన్ను మాత్రం వదిలిపెట్టొద్దు తండ్రీ ! "

విశ్వనాథ,  " భవానీభర్గులే తల్లీ దండ్రి యటంచు " ప్రగాఢంగా నమ్మినవాడుఅందుచేత, ఎటువంటి పరిస్థితులలోను, తన చేయిని వదలవద్దంటున్నాడుపరిపూర్ణమైన భక్తివిశ్వాసాలతో భగవంతుని నమ్మినవారిని, ఆయన ఎన్నటికీ వదలడు కదా



సువర్ణ సుమన సుజ్ఞేయము - 656 (మా స్వామి: 71)







స్వాతంబన్ మృదుశయ్యపైఁ బఱచితిన్ భక్తిప్రథావస్త్ర
త్యంతంబున్ బయిఁ జల్లితిన్ మృదుల భావాఖ్యప్రసూనాళి 
యంతర్గేహము బాగుజేసితిని నీకై కంటిదారిన్ బ్రతీ
క్షింతున్ వాసకసజ్జికన్ బలె నుమాచిత్తేశ ! విశ్వేశ్వరా !

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై ఒకటో పద్యం.

" విశ్వేశ్వరా ! మనస్సు అనే మెత్తని పానుపు మీద భక్తి అనే పేరు గల వస్త్రాన్ని పరిచానుదాని పైన, భావములు అనే మెత్తని పూలను చల్లానునా అంతరంగ మనే ఇంటిని చక్కగా శుభ్రపరిచాను. పార్వతీహృదయవల్లభా ! ఇక వాసకసజ్జిక వలె నీవు వచ్చే దారి వంక ఎదురుచూస్తుంటాను. "

అష్టవిధ నాయికలలో వాసకసజ్జిక ఒకరువాసకసజ్జిక అనగా, చక్కగా అలంకరించుకొని ప్రియుని కోసం ఎదురుచూసే నాయిక.




సువర్ణ సుమన సుజ్ఞేయము - 655 (మా స్వామి: 70)










సాయంతన మేఁగుదెంతు వని నే నే రోజు కా రోజు తం
డ్రీ ! సర్వాశలు యత్నముల్ ఫలితముల్ నీ మీఁదనే పెట్టి యా
యాసం బొక్కఁడె నే మిగిల్చుకొని సర్వానేహమున్ బుత్తు నీ
వేసం బూర్జిత చంద్రచూడ మెటులన్ వీక్షింతు విశ్వేశ్వరా !

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భయ్యో పద్యం.

" విశ్వేశ్వరా ! నీవు సాయంత్రం వేళ దర్శన మిస్తావని, రోజు కా రోజు ఎదురుచూపులు చూశాను. నా ఆశలు, ప్రయత్నాలు, ఫలితాలు, అన్నీ నీ మీదనే పెట్టుకొన్నాను. కానీ, అన్నీ అడియాశ లయిపోయినాయి. వృధాశ్రమ మాత్రం మిగిల్చుకొని, మొత్తం ఇహలోక యాత్ర సాగిస్తున్నానుతండ్రీ ! ఇక దివ్యమైన నీ చంద్రశేఖర రూపాన్ని విధంగా చూడగలను? "

శివుడు లయకారకుడు కావున సాయసంధ్యా కాలం లోని అర్చన, అభిషేకాదులని ఇష్టపడతాడుమృత్యుంజయుడు, జీవుడిని మృత్యువు నుండి అమృతత్వం వైపుకి తీసుకువెళ్తాడు. అందుచేత, అమృతాంశుడిని (చంద్రుడిని) మౌళిపై ధరించిన చంద్రశేఖరుని రూపాన్ని చూడాలని విశ్వనాథ అభిలాషఅనగా, మహాకవి అమృతత్వ సిద్ధిని కోరుకొంటున్నారు.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 654 (మా స్వామి: 69)










నిను వీక్షించెద నంచుఁ బూజలిడుదున్ నీకంచు లోనెంచుచున్ 
గనులన్ జోరున బాష్పముల్గురియుదున్ గాద్గద్యముల్ పొందుదున్
దనివోకే యెదలోని భావములు పద్యా లల్లి నా గుండెతోఁ
జని లోకంబును జూచి పుచ్చెదను నిశ్వాసాలు, విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని అరవై తొమ్మిదో పద్యం.

" విశ్వేశ్వరా ! నిన్ను కళ్ళారా చూడాలని పూజలు చేస్తాను. నీ రూపాన్ని లోపల తలచుకొని, ధారగా కన్నీరు కారుస్తాను. గొంతు బొంగురుపోతుంది. అంతటితో తృప్తిచెందక, నా హృదయంలోని భావాలను పద్యా లల్లి, నా గుండెతో యీ లోకాన్ని చూస్తాను. లోకం తీరు చూసి నిట్టూర్పులు విడుస్తాను. "

భగవత్సంబంధమైన భావన మనసులో చొరబడగానే పైన చెప్పిన మార్పులు జరగటం సహజం. అయితే సృజనాత్మక కవి  విషయంలో ఇది కొంచెం భిన్నగా ఉంటుందికవి, తన గుండెలో గూడు కట్టుకొన్న భావాలకు పద్య రూపమిచి లోకాన్ని విశ్లేషిస్తాడు, సంస్కరించటానికి ప్రయత్నిస్తాడు. లోకం పోకడ వెర్రితలలు వేస్తుంటే నిట్టురుస్తాడు.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 653 (మా స్వామి: 68)











వ్యాఘ్రంబుల్ గలవంచు నాకు భయమేలా? అచ్చటన్ గోముఖ
వ్యాఘ్రంబున్ బలె మోసపుచ్చవుగదా పైకెంతొ లోనంతయే
శీఘ్రంబచ్చొటికేఁగి తాపసుఁడనై చింతింప వాంఛింతు వ్యా
జిఘ్రన్మోక్షపథాశ మిక్కుటమయా చిత్తేశ ! విశ్వేశ్వరా !

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని అరవై యెనిమిదో పద్యం.

" విశ్వేశ్వరా ! నేను అడవుల్లో నివసించటానికి వెళ్తే, అక్కడ పెద్దపు లున్నాయని భయపడవలసిన అవసరం లేదుఎందుకంటే, అక్కడ మానవ సమాజంలో ఉన్నట్లుగా గోముఖవ్యాఘ్రాలు మోసం చేయవు కదా ! అరణ్యంలోని మృగాలు పైకి ఎలా కనపడతాయో, లోపల కూడా అట్లాగే ఉంటాయిఅందుచేత, నేను త్వరగా అరణ్యానికి వెళ్ళి, తపస్సు చేసుకోవాలని కోరుకొంటున్నానునీవు నా చిత్తాన్ని పాలించే ప్రభువువి. అభిలషణీయమైన ముక్తిమార్గం మీద నాకు ఆశ యెక్కువ తండ్రీ ! "

పద్యంలో, మానవ సమాజంలోనిమోసప్రవృత్తి కల గోముఖవ్యాఘ్రాల గురించి ప్రస్తావించి, అక్కడ కంటె అరణ్యంలో ప్రశాంతత యెక్కువని, తాపసవృత్తిలో కొనసాగి, మోక్షసిద్ధి కోరుకుంటున్నానని చెప్పారు.





ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like