Wednesday, 5 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 686 (మా స్వామి: 101)





ఆనందైకమయస్వరూప ! భవదీయైశ్వర్యమున్ ధూర్జటి 
శ్రీనాథుల్ కవితాసతీ కుచతటీ శ్రీ గంధ కస్తూరికా
స్థానంబున్ బొనరించి రిప్పటికి నస్మత్ స్తోత్ర పాత్రంబవై 
దేనెల్ ద్రావిన నోటికిన్ జలము లందింపయ్యె విశ్వేశ్వరా !

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని నూటొకటోచివరిదైన పద్యం పద్యాలలో కొన్ని దీర్ఘ సంస్కృత సమాసావృతమై, నా వంటి వాడు అన్వయం చేసుకొని, అర్థం చేసుకొనడానికి కష్టమైనా, తప్పొప్పులన్నీ పరమేశ్వరుని సంకల్పాలే ననే భావనతో, నాకు స్ఫురించిన అర్థాన్ని వ్రాశాను. కొన్ని పద్యాలకు అర్థం నాకే సంతృప్తికరంగా లేవునాకు, పాఠకులకు, పరమేశ్వరుడే సరైన అర్థాన్ని సరైన సమయంలో తెలియజేస్తాడనే పరిపూర్ణమైన భక్తిభావనతో, పద్యానికి అర్థాన్ని మీ ముందుచుతున్నాను.

" విశ్వేశ్వరా ! నీవు ఆనందమే సంపూర్ణంగా నిండి ఉన్నవాడివి. నీ మహానుభావుతను ధూర్జటి, శ్రీనాథుడు మొదలుగా గల మహాకవులు, పరిమళభరితములైన మంచి గంధము, కస్తూరి లేపనములతో కవితాసతికి అర్చన చేశారు. ఇప్పుడు నీవు నా పాలిన పడ్డావు. మహాకవులు తియ్యనైన తేనెను నీ నోటి కందిస్తే, నేను మంచినీళ్ళతో సరిపెడుతున్నాను. "

సంగీతసాహిత్యాలు సరస్వతీదేవి స్తనద్వయాలు.

పరమేశ్వరుడు అష్టైశ్వర్యప్రదాత. అణిమ, మహిమ,గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనేవి అష్టైశ్వర్యాలు.

ధూర్జటి మహాకవి కృష్ణదేవరాయలవారిచే " స్తుతమతియైన ఆంధ్రకవి " అని మెప్పు పొందినవాడు. శివభక్తిపూరకములైన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకం వ్రాసినవాడు. కవిసార్వభౌముడుఈశ్వరార్చనకళాశీలుడు, అయిన శ్రీనాథుడు కాశీఖండము, హరవిలాసము, భీమఖండము వంటి మహోత్కృష్టమైన శివభక్తి కావ్యాలను తెలుగుజాతి కందించారు.

పద్యం  ' అలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి ' అయిన విశ్వనాథవారి వినమ్రతకు మచ్చుతునకఅంతటి గాఢప్రతిభునికి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కడ తల ఎత్తుకోవాలో, భక్తిపూర్వక వినమ్రతతో ఎక్కడ తలదించుకోవాలో తెలుసు. విశ్వనాథునికి మధుధారల వంటి కవిత్వ మందించి, '  జలము లందింపయ్యె ' అని నిగర్వంగా చెప్పుకొన్న ఋషిత్వం ఒక్క విశ్వనాథకే చెల్లింది.

స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీన్ మహీశాన్ 
గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం
లోకా స్సమస్తాన్ సుఖినో భావంతు.

ఓం శాంతి శ్శాంతి  శ్శాంతిః




సువర్ణ సుమన సుజ్ఞేయము - 685 (మా స్వామి: 100)





నినుఁ గ్రొంగ్రొత్తలు తేర్చు గుంఫనల వర్ణింపంగ నూహింతు నౌ
నని యే దారినిఁబోయి పూర్వకవి పాదాంకంబులే తోఁచి లో
నన లజ్జాపరిగూఢ మానసుఁడనై నాలోన నేనే వినూ
తన శంకాహృదయుండ నౌదును, మఱి క్షంతవ్యుండ, విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని వందో  పద్యం.

" విశ్వేశ్వరా ! నిన్ను క్రొత్త క్రొత్త పద ప్రయోగాలతో వర్ణించాలని ఉహిస్తాను. అలాగని, పోయి పోయి పూర్వాంధ్ర మహాకవుల మార్గమే  తోచి, సిగ్గు  పడి, అది నా మనసులోనే దాచుకొనినాలోపల నేనే సరిక్రొత్త సందేహాలతో కూడిన హృదయం కలిగిన వాడినౌతున్నానుమరి నన్ను క్షమిoచు తండ్రీ !

నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు, నాచన సోమనలను తనకు గురువులుగా అవతారికలో చెప్పుకొన్నారు  విశ్వనాథవారిని గురువులుగా భావించి, వారి స్ఫూర్తిని పొందుతూ, తనదైన స్వతంత్ర మార్గంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షము వంటి బృహత్కావ్య రచన చేశారు విశ్వనాథ


సువర్ణ సుమన సుజ్ఞేయము - 684 (మా స్వామి: 99)





ప్రస్థానత్రయమున్ గనుంగొనుట తప్పన్ క్లిష్టకామావిలా
వస్థామార్గము నువ్వుగింజయిన దప్పన్ బోదు లోఁ గాల
మేఘస్థూలాకృతి నల్లనైన పొగయై కట్టెన్ వెలారెన్ మన 
స్స్వస్థంబని నేఁటి జన్మకె గడింపన్ లేనొ విశ్వేశ్వరా !'

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభై తొమ్మిదో పద్యం.

" విశ్వేశ్వరా ! ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత మొదలగునవి  సూచించిన జీవనమార్గాన్ని ధర్మ మార్గాన్ని తప్పను.   అలాగని, దుస్తరమైన  కోరికలతో కూడిన అవస్థల దారి నుండి  నువ్వుగింజంతైనా  తప్పించుకోవటం  కూడా సాధ్యం కాకుండా ఉందిప్రళయకాల మేఘం దట్టంగా, నల్లగా ఎలా అలుముకొంటుందో, విధంగా అజ్ఞానం, నా లోపల ఆవరించుకొని ఉందిమనశ్శాంతి అనేది ఇక జన్మకు దొరకదా స్వామీ ! "

వేదాంతములైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, మూడింటినీ కలిపి ప్రస్థానత్రయ మంటారుఇవి మానవజీవితంలో ఆచరణయోగ్యములైన గ్రంథాలు. నిష్కామ కర్మతో, తామరాకు మీద నీటినొట్టులాగా, సుఖదుఃఖాలు, మానావమానాలు, కలిమిలేములు, మొదలైన ద్వంద్వాలకు అతీతంగా, శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందటమే మానవజీవితానికి సార్థకత చేకూర్చేదిపైన చెప్పిన బృహద్గ్రంథాల సారాన్ని నిజజీవితంలో ఆచరించి, నిష్కామ కర్మాచరణ చేస్తూ, సమన్వయంతో బ్రతకటం కష్టతరమైన పనిఅందువల్ల, కోరిక వలయoలో చిక్కుకొన్న మనిషి మనశ్శాంతిని కోల్పోతున్నాడని విశ్వనాథ ఆవేదన.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 683 (మా స్వామి: 98)





మును లేనట్టిది లోభ మొక్కఁడు ననున్ బొందెన్ జరాక్రాంతియౌ
నని భీతావహమైనతో సుతుని యందై  మోహపుంబెల్లు, కా 
మిని తొల్లింటిది నన్ ప్రశస్తపథగామిన్ జేయు దానిన్ దొలం
చిన మార్గానఁ దొలంచి నా విహపరశ్రేయస్సు, విశ్వేశ్వరా !

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభై ఎనిమిదో  పద్యం.

" విశ్వేశ్వరా ! ఇంతకు ముందు లేనటువంటి లోభ మనే దొకటి నాలో కనపడుతూ ఉంది. వార్థక్యం ముంచుకొస్తుందనే భయతో, కొడుకు మీద మోహ మెక్కువయింది. నన్ను మంచి దారిలో నడిపిస్తున్న నా మొదటి భార్యను తీసుకువెళ్ళిపోయినట్లే, నా కొడుకును కూడా తీసుకువెళ్ళిపోయి, నాకు ఇహపర సుఖాలు లేకుండా చేశావు. "

విశ్వనాథవారికి ప్రథమ కళత్ర వియోగం జరిగింది. ఆమె స్మృతి చిహ్నంగా వరలక్ష్మీ త్రిశతి అనే అద్భుతమైన స్మృతికావ్యాన్ని వారు రచించారుతరువాత, పదహారు, పదిహేడేళ్ళున్న ఒక కుమారుడు కూడా చనిపోయాడు దుఃఖకాలం లోనే, కిన్నెరసాని పాటలు వ్రాశానని విశ్వనాథవారే ఒక ఆకాశవాణి ఇంటర్వ్యూలో కేశవపంతుల నరసింహశాస్త్రిగారితో చెప్పారు.


ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like