Wednesday, 5 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 676 (మా స్వామి: 91)





కించిత్కృతి యిట్టులైన మఱి యేమీ లేదు లేవయ్య వే
ధా ! కాపర్దశిఖాధునీ స్వనితగాథా ! విశ్వనాథా ! భవ
చ్ఛీకంఠాభరణంబు చెప్పెదను రాజీవంబులోఁ దేనియల్ 
కైకోనే కయికోని క్రొత్త సిరి వాఁకల్ గట్ట విశ్వేశ్వరా

ఇది ' మాస్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభయ్యొకటో పద్యం.

" విశ్వేశ్వరా ! కొద్దిపాటి కావ్యం ఇట్లా అయినా కూడా ఏమీ బాధ లేదు లేవయ్యా ! నీ గొంతులో, లోకకళ్యాణార్థం దాచుకొన్న హాలాహలాన్ని కంఠాభరణంగా మలిచి నీలకంఠుడివయ్యావు చూశావూ, అటువంటి నీకు, తామరపూల నుండి జాలువారే  తేనెలు కూడా ఇవ్వలేని క్రొత్త తీయదనాన్ని, సొగసులను ఇచ్చే బృహత్కావ్యాన్ని, జగత్కళ్యాణప్రదంగా, కానుకగా ఇస్తాను. "  

విశ్వనాథ శ్రీమద్రామాయణ కల్పవృక్షము అనే మహాకావ్యరచన చేసి పరమేశ్వరాంకితం చేశారు.

విశ్వనాథ, శివుని పరంగా చాలా అందమైన సంబోధనలను, విశేషణాలను వాడుతారు. వేధ అంటే బ్రహ్మ, విష్ణువు, పండితుడు అనే అర్థా లున్నాయి. సదాశివుడు త్రిమూర్త్యాత్మకుడు, సర్వజ్ఞుడు

" కాపర్దశిఖాధునీ స్వనిత గాథా ! "చాలా అందమైన ప్రయోగంకపర్ది అంటే చిక్కుముడులు కల కేశపాశములు కలవాడు, శివుడు. జటావనుల్లో సుడులు తిరుగుతూ, గర్జిస్తున్నది ఆకాశగంగ. గంగావతరణ కథావస్తువు శివుడు. స్వనితము అంటే శబ్దము, గర్జన.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 675 (మా స్వామి: 90)





నా భాగ్యం బిది యెట్టిదో శతక మైనన్ బూర్తి కాదే వ్యధా
క్షోభాకంపిత దేహయష్టి పులకాశ్రుస్వేద రూపంబుగాఁ
బ్రాభాతాంబుజ మట్లు నూత్న మధుహర్ష శ్రీధునీ వీచికా
క్షోభంబందెడుఁ దండ్రి ! యింత కృపయా చూపింతు విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభయ్యో పద్యం.

" విశ్వేశ్వరా! నా అదృష్టం ఇట్లా ఉంది. వంద పద్యాలైనా పూర్తి కాలేదు. బాధతోకలతతో, కంపిస్తున్న యీ శరీరం పులకించి, కన్నీటి రూపంలోను, స్వేదంగాను, ఉదయకాలంలో, క్రొత్త తేనెవాకలతో, నదీతరంగాలపై నుండి వీచే గాలితో, పులకించిపోయిన  పద్మంలాగా, కలత చెందుతున్నది ప్రభూ ! నా మీద ఇంత దయ చూపిస్తావా తండ్రీ ! " 

విశ్వనాథవారు, ఆత్మాశ్రయ ధోరణిలో, జీవుని వేదనను తెలియజేస్తూ, భక్త్యావేశంలో వ్రాసిన పద్యాలివి.  ' వంద పద్యాలు లేని ' అని అన్నారు కానీ, నూటొక్క పద్యాలున్న, శతక లక్షణాలున్న మహోత్కృష్ట కావ్యం ' మా స్వామి ' .



సువర్ణ సుమన సుజ్ఞేయము - 674 (మా స్వామి: 89)





తేనెల్ వాఱును మేఘగర్జనలు వీతెంచున్ బికీకన్యకా 
నూనవ్యాహృతి మాధుపంచమము చిందున్ ద్యోనదాంభఃకణ
శ్రీనృత్యంబులు సూపు నా కవిత తండ్రీ ! నా హృదంభోజ మం
దానందచ్యుతి పొంది నీ శతక మిట్లై పోయె, విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై తొమ్మిదో పద్యం.

" విశ్వేశ్వరా ! నా కవిత్వంలో తేనెవాకలు పారుతాయిమేఘగర్జనలు ప్రతిధ్వనిస్తాయి. ఆడు కోయిలల కుహూకుహూరావాలు వినిపించి మధుమాస సోయగం చిందులాడుతుంది. ఆకాశగంగ నీటితుంపరలు నాట్యం చేస్తాయినా హృదయపద్మంలో ఆనందం కొంత తరిగిపోయి, శతకం యీ విధంగా తయారయింది. "

పద్యంలో విశ్వనాథవారి మహాకవిత్వ లక్షణాలు వివరించబడ్డాయి. వారి కవిత్వంలో అచ్చ తెలుగు పదాల తియ్యదనం ఉంది. సంస్కృత సమాసాలతో కూడిన ప్రౌఢకవిత్వం ఉంది. ప్రకృతి వర్ణన లున్నాయి. అందమైన కల్పన లున్నాయి. సర్వలక్షణ సంగ్రహం వారి కావ్యాలు



సువర్ణ సుమన సుజ్ఞేయము - 673 (మా స్వామి: 88)





కవి శైవాశమటందు రక్కతననే గాఁబోలు నిన్ బోలె నన్
గవిసెన్ నిక్కముగా నమాయకత, నా కంఠంబు గోయంగ  నెంచు
విరోధిన్ సయితమ్ము నే నదుమఁగాఁ జూడన్ మహాకోప మే
చు వడిన్ దగ్గును నిష్ఠ చాల దరులన్ జూర్ణింప, విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై ఎనిమిదో పద్యం

" విశ్వేశ్వరా ! కవిని శివుని అంశ కలవాడని ఇందుకే అంటారనుకొంటాను. నీ లాగే, నాకు కూడా నిజంగా బోలెడంత అమాయకత్వం వచ్చింది. నా మెడ తెగ్గోద్దామనుకొనే శత్రువుని సైతం నేను అడ్డుకోవాలని అనుకోను. విపరీతమైన కోపం వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. శత్రువులను నిలువరించేటంత  శ్రద్ధ, తీవ్రత, నాలో లేవు స్వామీ ! "

శివుడికి బోళాశంకరుడని పేరు. అదే విధంగా, విశ్వనాథ కూడా ఎవరన్నా కష్టాల్లో ఉంటే కరగిపోయే స్వభావం కలవాడని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు, ఆయన దాతృత్వాన్ని చవి చూసినవారు, అనుయాయులు, శిష్యులు చెప్పే మాట. వారు బ్రాహ్మీమయమూర్తే గాదు, పదహారణాల బ్రాహ్మణుడు కూడా ! మాట కఠినం, మనసు వెన్న


సువర్ణ సుమన సుజ్ఞేయము - 672 (మా స్వామి: 87)





పైకిన్ లోపల నెంతొ యంత బహుధావ్యక్తంబుగా వీత మా
యాకారుల్ కుజనుల్, బహిస్సుధలు లోనగ్నుల్ మఱీ లో స్వయం 
పాక శ్రీపరిపాకులే సుజనుల లప్పా ! యింత దుర్మార్గ మీ 
లోకం బింతకు నేను జాలను దయాళూ ! పాహి ! విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై ఏడో పద్యం.

" విశ్వేశ్వరా ! చెడ్డవాళ్ళు, లోపల ఎలా ఉంటారో, దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా పైకి    మాయవేషాలు వేస్తుంటారువీళ్ళందరూ పైకి మాత్రం, మాటల్లో తేనెలు చిలికిస్తుంటారు, లోపల మాత్రం నిప్పులు కురిపిస్తుంటారు. మరి ఇటువంటి స్వయంపాకం చేసుకొనే, ముదిరిపోయిన  జనాలు సన్మార్గులుగా చెలామణి అవుతున్నారు తండ్రీ ! ఇంత దుర్మార్గపు లోకాన్ని నా వంటివాడు తట్టుకోలేడు. అందుకే శరణు కోరుతున్నాను స్వామీ ! "

లోకంలో దుర్మార్గం, కుటిలత్వం, మాటకారితనం, క్రౌర్యం, ముఖ్యంగా, స్వార్థం పెరిగిపోయాయిఅటువంటి లోకంలో, ధర్మానికి కట్టుబడిన, ఋజుప్రవర్తన కలిగిన, అన్యాయం కళ్ళబడ్డప్పుడు, ఉన్నదున్నట్లుగా మాట్లాడేవారిని, ఎందుకూ పనికిరానివారిగా, నోటిదురుసువారిగా జమకడుతున్నారు. విషయాన్నే స్వానుభవంతో విశ్వనాథ చక్కగా యీ పద్యంలో వివరించారు.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 671 (మా స్వామి: 86)





భూమీదేవుల మానసంబు మృదువై పోల్పన్ వచస్సుల్ శిలా
సామాన్యంబులునై కనంబడెడిపో ! జాల్ముల్ మనోభావమం
దేమో వహ్నులు పైకి వెన్నలు, జగం బీ రీతిగా సాగెడిన్
భూమీదేవుల దుష్టు లందురు జనమ్ముల్ చూడు విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభయ్యారో పద్యం.

" విశ్వేశ్వరా ! విప్రుల మనస్సు అతి మెత్తగాను, వారి మాటలు రాయి లాగా కఠినంగాను కనబడతాయికపటత్వం కలవాళ్ళు మనసు లోపల నిప్పుల కుంపటి పెట్టుకొని, పైకేమో వెన్న లాగా మెత్తగా కనిపిస్తారులోకమంతా యీ రీతిగానే సాగుతున్నదిమెత్తని మనసున్న విప్రులని యీ జనాలు చెడ్డవాళ్ళంటారు చూడు స్వామీ ! "

నన్నయగారు ఆంధ్ర మహాభారతం లోని ఉదంకోపాఖ్యానంలో " నిండుమనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము (విప్రుని యొక్క నిండైన మనస్సు అప్పుడే తీసిన వెన్న లాంటిదని, మాట మాత్రం వజ్రాయుధం కంటె పదునైనది) " అని బ్రాహ్మణుని యొక్క స్వభావాన్ని గురించి చెప్పారు. విశ్వనాథ, అదే భావాన్ని యీ పద్యంలో పొదిగి, లోకం రీతిని వివరించారు



ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like