Wednesday, 5 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 670 (మా స్వామి: 85)



కుమతుండైన దురాత్ము పాపములు భక్తుండైన యవ్వాని
ష్టములున్ బండినఁగాని నీకు నది నచ్చన్ బోదఁటట్లుండెఁబో
క్రమమేలా గయికోవు చావొకటియేగా తక్కు వా వెన్క
ర్వము నెగ్గించితి వద్దిగూడఁ బ్రియమా? రానిమ్ము, విశ్వేశ్వరా ! "

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై ఐదో పద్యం.

" విశ్వేశ్వరా ! చెడుబుద్ధి కలిగిన దుర్మార్గుని పాపాలు, భక్తుని యొక్క కష్టాలు బాగా పండితే గానీ నీకు నచ్చదనుకొంటానుసరే, అదట్లా ఉండనీ ! దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదా ! నే ననుభవించే కష్టాల్లో చావొక్కటేగా తక్కువఅన్నీ నువ్వనుకున్నట్లుగానే జరిగాయినా చావు కూడా నీకు ప్రియమైతే, అది కూడా రానీ ! "

భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మిన భక్తుడు, ఆవేశంలో భక్త రామదాసు లాగా ఏవేవో మాట్లాడుతుంటాడుఅది అతని భక్తికి పరాకాష్ఠ. నిందాపూర్వక భక్తిలో, భక్తునికి భగవంతునికి మధ్య గల ఆత్మానుసంధానం బహిర్గతమౌతుంది.



సువర్ణ సుమన సుజ్ఞేయము - 669 (మా స్వామి: 84)





నీ వేమో కనిపించకుండినను గానీ యైనఁ గన్పించిన
ట్లే వేలూహలుగాఁగఁ దెచ్చుకొని నీవే కాక లేఁడే కదా
దైవంబంచును నా కవిత్వము భవత్పాదద్వయిన్ జేర్చితిన్
రావే దీనికి నే ఫలం బొసఁగెదో రానిమ్ము, విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభైనాలుగో పద్యం

" విశ్వేశ్వరా ! నీవు కనిపించకుండా ఉన్నాగానీ, కనిపించినట్లుగానే వేలకొద్దీ ఊహలు చేసుకొని, ఇక నీవు తప్ప అన్యదైవం లేడని, నా కవిత్వాన్ని నీ పాదార్పణం చేశానుదానికి ఎటువంటి ఫలిత మిస్తావో, ఇవ్వుఅంతే స్వామీ !  "

విశ్వనాథ, వారి బృహత్కావ్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని పరమేశ్వరాంకితం చేశారుకల్పవృక్షం ఖండాంత పద్యాలలో, పునరావృత్తిరహిత మోక్షసిద్ధి కోసం మహాకవి యొక్క వేదన కనిపిస్తుంది. ఆయన, తన గుండెను, పరమేశ్వరుని గుండెతో రాపిడి పెట్టాననీ, దాని కేమైనా ఫలముంటే ఇవ్వమనీ, పరమేశ్వరుణ్ణి వేడుకొన్నారు.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 668 (మా స్వామి: 83)



నీ కారుణ్యము సాటి చూచెద వియన్నీలాతి నీలప్రభా
శ్రీకృన్మోహన వర్ణ భాద్రపదసం శ్లేష ప్రగర్జద్విలా
సై కాంభోద తనూ ప్రకాశిత వధూ సౌదామనీ దేహవ
ల్లీ కళ్యాణమనోజ్ఞదీధితి కరాళీ కేళి, విశ్వేశ్వరా !

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభైమూడో పద్యం.

" విశ్వేశ్వరా ! నీ దయ ఎంతటిదో చూపుతాను. నీలాకాశం లోని, అత్యంత సుందరమైన నీలవర్ణ కాంతులను విరజిమ్మే, అత్యంత సుందరమైన భాద్రపదమాసపు, గర్జించే నల్లని మేఘం కడుపులో ప్రకాశించే మెరుపుకన్య శరీరలావణ్యం యొక్క విలాసనృత్యం నీ కరుణ. "

పద్యం కూడా ఒకే ఒక దీర్ఘ సంస్కృత సమాసంలో ఉంది. భగవంతుని సృష్టి విలాసమే ప్రకృతి సౌందర్యంఆరు ఋతువుల లోని ప్రకృతి సౌందర్యం, సౌభాగ్యం ఆయన కరుణా విశేషమే అన్నది మహాకవి భావన.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 667 (మా స్వామి: 82)





నీ కారుణ్యము సాటిచెప్పెదఁ బికీ నిర్హ్రాద వేళాద్విరే
ఫైకోన్మాదిత సర్వతః పరివృత ప్రారంభగీతీ లస
న్మాకందాగ్రలతాంతపత్ర విగళన్మారంద కల్లోలినీ
వ్యాకీర్ణాంబుకణ ప్రసేక శిశిరత్వం బందు విశ్వేశ్వరా !

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై రెండో పద్యం.

" విశ్వేశ్వరా ! నీ దయ ఎంతటిదో చాటి చెబుతాను తండ్రీ ! ఆడుకోయిలలు గొంతు విప్పే వేళ, మత్తెక్కిన గండు తుమ్మెదల ఝంకారాలు పరిసరా లంతటా వ్యాపించగా, గున్నమామిడి చిగురుటాకులు ప్రకాశిస్తుండగా, పూవులనుండి  మధు ధారలు జాలువారుతుండగా, మంచు బిందువులతో పువ్వులు తడిసిపోగా, శోభాయమానంగా ఉన్న శిశిరత్వంలో, నీ కరుణ దాగి ఉంది ప్రభూ ! "

ఋగ్వేద సంహిత భాగమైన రుద్రాధ్యాయం, ప్రకృతి లోని సమస్త వస్తుజాలంలో శివుని యొక్క అంతర్యామిత్వం నెలకొని ఉన్నదని సుస్పష్టంగా తెలియజేస్తున్నది.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 666 (మా స్వామి: 81)





నీ కారుణ్యము సాటితెత్తును భవానీ మోహనాకేకర
శ్రీకార శ్రవణాంబుజాత రుచిమత్స్మేరాననానంద కు
ల్యాకల్యాణ తరంగవత్రివళి సంలగ్నాత్మసంధాన !
ర్షాకాలాంబుద సంస్రవజ్జలలవాచ్ఛశ్రీకి, విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై ఒకటో పద్యం.  

" విశ్వేశ్వరా ! నీ కరుణకు సాటి యేదో తెస్తున్నాను, విను. పార్వతి యొక్క అందమైన కడగంటి  చూపులను, శ్రీకారముల వలె నున్న (శుభప్రదమైనపద్మాల వంటి చెవులనుకాంతివంతమైన అరవిరిసిన ముఖాన్నిఆనందసరోవరపు తరంగాలు అనబడే  కళ్యాణప్రదమైన నూగారును తనివితీరక వీక్షించే ఆత్మసంధానం కలవాడివి నీవునీ కరుణ  వర్షాకాల మేఘాలు కురిపించే స్వచ్ఛమైన నీటిజల్లు వంటిది. " 

పార్వతీదేవి వంటి అందమైన స్త్రీ విశ్వంలో లేదు. అమ్మవారి అందానికి హక్కుదారు అయ్యవారు. శివుడు అర్థనారీశ్వరుడువారిద్దరిదీ విడదీయరాని ఆత్మానుసంధానం. ఆమె ప్రకృతిస్వరూపిణిదృశ్యమాన జగత్తులోని జీవులలో నిద్రాణంగా ఉన్న శక్తిరూపిణిసహస్రారంలో, నిశ్చలమైననిర్భరమైన, యోగసమాధిలో నున్న శివుని ఆత్మ, మూలాధారంలో నున్న శక్తి పైన లగ్నమై ఉంటుందిఆయన ఆత్మ ఎప్పుడూ అమ్మవారి ఆత్మతో అనుసంధానమై ఉంటుంది. వారిద్దరిదీ స్త్రీపుంసయోగాత్మకమైన చైతన్యస్వరూపం. యోగమార్గంలో, జీవునిలో నున్న శక్తిని ఉద్దీపితం చేసి, సహస్రారంలో నున్న శివునితో అనుసంధానం చేయటమే జీవబ్రహ్మాత్మైక్యాను సంధానం. అందువల్లనే, విశ్వనాథ " సంలగ్నాత్మసంధాన " అన్న విశేషణాన్ని వాడారు.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 665 (మా స్వామి: 80)





నీ కారుణ్యము సాటిసేయుదు హిమానీవాఃకణాలోల మా
లా కేళీనలినాకరాచ్ఛజల వేలా కేలికాసక్త బా
లా కర్పూరకపోలఫాలరుచిజాల స్రస్తచేల స్ఫుర
త్ప్రాకారాకృతిమత్కుచద్వితయసంభారాలు, విశ్వేశ్వరా !

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభయ్యో పద్యం.

పద్యం నాల్గు పాదాలు ఒకే ఒక దీర్ఘ సంస్కృత సమాసంగా ఉందిసంస్కృత భాషాపరిజ్ఞానం లేని నా వంటి వాడికి పద్యార్థాన్ని అన్వయించుకోవటం కష్టంఅయినా చిన్న ప్రయత్నం చేస్తున్నానుపాఠకులు మన్నిస్తారని, పెద్దల ద్వారా, నా తప్పులు సరిదిద్దబడి, సరియైన అర్థం మీకు లభిస్తుందని ఆశిస్తున్నాను.

" విశ్వేశ్వరా ! నీ కరుణ ఎటువంటిదో చేసి చూపిస్తానుచల్లని నీటితో నిండి, తేలియాడుతున్న పద్మాలకు నివాసమైన స్వచ్ఛమైన సరోవరాల గట్ల మీద ఆడుకొంటున్న కన్యల యొక్క కర్పూరతాంబూలంతో నిండియున్న బుగ్గల నిగ్గులతో, జారుతున్న పైటకొంగుల చాటున ఉన్నతంగా కనిపించే స్తనద్వ్యయం యొక్క సంపూర్ణత్వాన్ని  గుర్తుచేసేటటువంటిది నీ కరుణ. "

శివుడు అర్థనారీశ్వరుడుఆయన వక్షస్థలం సంగీత, సాహిత్య నృత్య, నాట్యవిశేషాలకు ఆటపట్టుజీవితానికి సంపూర్ణత్వాన్ని కలిగించేది.

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like